పెళ్లి పేరుతో 25 మందికి పైగా మహిళలను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

పెళ్లి పేరుతో మహిళలను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కాజేసిన ఓ వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్‌ చంద్రప్రకాష్‌ త్రివేది అనే వ్యక్తి ఇదే తరహాలో 25 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని ఠానే పోలీసు స్టేషన్‌లో 2022 మార్చిలో ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. వార్తాపత్రికలో వచ్చిన వివాహ ప్రకటన ఆధారంగా 2019లో తన మనవరాలిని అజయ్‌ అగర్వాల్‌ అనే పేరుతో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడని, తరువాత అతడు మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు అతడే అనూజ్‌కుమార్‌ చంద్రప్రకాష్‌ త్రివేది అని పోలీసులు గుర్తించారు.

వివాహం జరిగిన కొంతకాలానికే కొత్త ఫ్లాట్‌ కొనాలని, మరో ఇల్లు నిర్మించుకోవాలని డబ్బులు కావాలంటూ ఆ వ్యక్తి తమపై ఒత్తిడి తెచ్చినట్లు వృద్ధురాలు తెలిపింది. పలుమార్లు కలిపి సుమారు 82 లక్షల రూపాయలను నగదుగా తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం 2022 ఫిబ్రవరిలో బంధువుల వివాహానికి వెళ్తున్నట్లు చెప్పి, ఇంట్లో ఉన్న 33 తులాల బంగారంతో పరారైనట్లు వివరించింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా ఠానే పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే తరహా పద్ధతిలో త్రివేది మరో 25 మందికి పైగా మహిళలను కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనియల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దివ్యాంగులు, వితంతువులు, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

సానుభూతి చూపిస్తూ, నమ్మకం కలిగించి పెళ్లి చేసుకొని, తరువాత వారి నుంచి డబ్బు, నగదు, బంగారం తీసుకొని అదృశ్యమయ్యే విధానాన్ని అతడు అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. ఇలా కాజేసిన డబ్బుతో త్రివేది ఒక BMW కారును కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ మోసాలలో త్రివేది కుమారుడికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని బాధితులు ఉండే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు సంబంధిత మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.