వికసిత భారత్ @2047 పై ఫోకస్

ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సమావేశంలో దేశ అభివృద్ధి, సమగ్ర మానవ వనరుల పురోగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనపై విస్తృతంగా చర్చించారు.

నీతి ఆయోగ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఏడాది సమావేశం ప్రధాన అంశంగా “ వికసిత భారత్ @2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి”ను నిర్ణయించారు. వయస్సు, ప్రాంతం, లింగం, సామాజిక–ఆర్థిక నేపథ్యం వంటి భేదాలు లేకుండా ప్రతి పౌరుడి సంక్షేమాన్ని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించింది.

ఈ సందర్భంలో దేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను విస్తరించడంపై ప్రధానంగా చర్చలు సాగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికలను జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయడం, సమన్వయంతో ముందుకు సాగడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది.

సమగ్ర మానవ అభివృద్ధి కోసం రూపొందించిన కార్యాచరణ నాలుగు కీలక స్తంభాలపై ఆధారపడి ఉందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. అవి – మానవ వనరుల అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉత్పాదక ఉపాధి, వ్యవస్థాపకత, వికేంద్రీకృత అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం, సమగ్ర సంక్షేమం, అందరికీ సమాన అవకాశాలు, గౌరవప్రద జీవనం.

పాలన వ్యవస్థలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI), భాగస్వామ్యాలు, డేటా ఆధారిత విధానాల ద్వారా అమలు ప్రణాళికను రూపొందించడంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అలాగే 2025 డిసెంబర్‌లో జరిగిన 5వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సులో వచ్చిన సిఫార్సులను ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, క్రీడలు, పాఠ్యేతర కార్యక్రమాల అభివృద్ధిపై ప్రత్యేక చర్చలు జరిగినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.

ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల Lieutenant Governors, Administrators, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యులు, CEO హాజరయ్యారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , అస్సాం సీఎం హిమంతా బిస్వా శర్మ, బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త , హర్యానా సీఎం షైనీ, వెస్ట్ బెంగాల్ సీఎం సువెందు అధికారి , తమిళ నాడు సీఎం జోసెఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం విడి సతీసన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.