రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
పేపర్ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా..
: కీలక సవరణలకు సిద్ధమైన కేంద్రం
నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లీక్‌లకు (Paper Leak) చెక్ పెట్టే అంశంపై శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ప్రధాని మోదీ వీడియో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి చట్టంలో కీలక సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కేసుల్లో దోషులకు భారీ జరిమానాతో పాటు సుదీర్ఘకాలం కఠిన జైలు శిక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది.
2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టంలో కేంద్రం కీలక సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానాను విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది. ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెంచేలా చట్టాన్ని సవరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇక, పేపర్ లీకులపై విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దిల్లీ న్యాయస్థానంలో తొలి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటవ్వగా.. మరో నాలుగింటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాల పరిధిలో.. లీకులకు సంబంధించిన కేసుల విచారణను ఏడాదిలోపే పూర్తిచేసి దోషులకు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు చేయనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రతిపాదిత సవరణలను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వచ్చే వారంలో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ ప్రతిపాదనలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
సీజేపీతో మరోసారి చర్చలు..
ఇదిలా ఉండగా.. దిల్లీలో నిరసనలు చేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీజేపీతో కేంద్రం భేటీ అవ్వడం ఇది రెండోసారి. జులై 20న చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళనల తర్వాత సీజేపీ బృందంతో కేంద్రమంత్రులు సమావేశమైన సంగతి తెలిసిందే.
లీకేజీలపై సమగ్ర చర్యలకు కేంద్రం హామీ ఇవ్వడంతో ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించారు. అయితే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ చెబుతోంది. ఈ నిరసనల నేపథ్యంలో దిల్లీలో శుక్రవారం కూడా 17 మెట్రోస్టేషన్లను మూసివేశారు. మరోవైపు, ఇదే అంశంపై పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.







