రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం.. : రాహుల్ గాంధీ ధ్వజం
ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశ విద్యా వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రే ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, విద్యా రంగంలో నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం..
విద్య అనేది దేశ భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్న రాహుల్ గాంధీ.. ప్రస్తుత విధానాల వల్ల వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యా రంగంలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే బాధ్యత వహించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్నంత కాలం విద్యా వ్యవస్థలో మార్పులు సాధ్యం కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి..
ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం మానుకోవాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హితవు పలికారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ‘చలో పార్లమెంట్’ చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపలేదంటూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందంటూ ఆయన మండిపడ్డారు. పెల్లెట్లు తగిలి గాయపడిన సాహిల్ అనే బాధితుడిని పక్కన పెట్టుకొని దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఆందోళనకారులను ఆడ్డుకునేందుకు పెల్లెట్ గన్‌లను ప్రయోగించలేదని కేంద్రం వాదిస్తోంది. కానీ, ఇదిగో రుజువు. ఈ విద్యార్థి వాటివల్లే గాయపడినట్లు వైద్యులు కూడా చెబుతున్నారు’’ అంటూ బాధితుడి గాయాలను మీడియాకు చూపించారు. అతడి కన్ను, మోచేయి, ఇతర శరీర భాగాలపై గాయాలైనట్లు తెలిపారు. ‘‘ఈ సోదరుడి కుడి కన్నుకు పెల్లెట్ తగిలింది. ప్రస్తుతం పూర్తిగా కనిపించడం లేదు. భవిష్యత్‌లో చూపు వస్తుందో, రాదో కూడా చెప్పలేం. ఇలాంటి బాధితులు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ గోడు చెప్పుకొనేందుకు ముందుకొస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. భారత్ భవిష్యత్‌పై ప్రభుత్వం కాల్పులు జరిపిందంటూ మండిపడ్డారు. బాధితులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.







