ఢిల్లీ:-నీట్ పరీక్షలో అవకతవకలపై నిరసనగా జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. నీట్ విద్యార్థులకు మద్దతుగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష గురువారం నాటికి 19వ రోజుకు చేరుకుంది. దీర్ఘకాలిక ఉపవాసం కారణంగా వాంగ్ చుక్ శరీర బరువు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో నిరసన శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్ చుక్ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజా వైద్య పరీక్షల ప్రకారం 59 ఏళ్ల వాంగ్ చుక్ బరువు ఇప్పటివరకు 9 కిలోలకు పైగా తగ్గి 57.15 కిలోలకు పడిపోయింది. ఆయన రక్తపోటు 105/61 mmHg, రక్తంలో చక్కెర 80 mg/dL, ఆక్సిజన్ స్థాయి 97 శాతానికి తగ్గినట్లు వైద్యులు వెల్లడించారు. స్పృహలో ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వైద్య బృందం తెలిపింది.

వాంగ్ చుక్ ప్రస్తుతం 24 గంటల వైద్య పర్యవేక్షణలోనే దీక్ష కొనసాగిస్తున్నారని వైద్యులు తెలిపారు. నిరాహార దీక్ష కారణంగా శరీరంలో శక్తి నిల్వలు తగ్గిపోవడం, బీపీ, షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన నెలకొంది. నిరసన శిబిరంలో ఉన్న మద్దతుదారులు, విద్యార్థి సంఘాలు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వాంగ్ చుక్ దీక్ష విరమించాలని మద్దతుదారులు కోరుతున్న నేపథ్యంలో ఆయన తాజా వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందేశంలో తన నిరాహార దీక్షను విరమించమని అడగొద్దని, బదులుగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగించాలని మద్దతుదారులను కోరారు.

“నేను చావుకు దగ్గరలో ఉన్నాను.. దీక్ష విరమించమని అడగొద్దు”

వీడియో సందేశంలో వాంగ్ చుక్ జూలై 20న పార్లమెంట్ వరకు నిర్వహించనున్న ‘చలో సంసద్’ శాంతియుత యాత్రలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన సూచించినట్లు నిరసన శిబిరం వర్గాలు తెలిపాయి.

మరోవైపు జంతర్ మంతర్ వద్ద వాంగ్ చుక్‌తో పాటు పలువురు విద్యార్థి నేతలు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలిక నిరాహార దీక్ష కారణంగా కొందరి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరినట్లు విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. దీంతో నిరసన శిబిరంలో పాల్గొంటున్న వారి ఆరోగ్య పరిస్థితులపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.