రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ప్రత్యామ్నాయ కూటమి దిశగా స్టాలిన్!
చెన్నై: జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాల ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో కొత్త కూటమి ఏర్పాటుకు ద్రావిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నారని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై డీఎంకేలో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో, స్టాలిన్ కొత్త రాజకీయ సమీకరణల దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పార్టీ కీలక నేతలు, ముఖ్యంగా ఢిల్లీలో చురుకుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఎంపీలను రంగంలోకి దింపేందుకు ఆయన సిద్ధమైనట్టు చెన్నై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జాతీయ కూటమి రూపకల్పనపై ఇటీవల చెన్నైలో జరిగిన డీఎంకే సమావేశంలో, ఢిల్లీలో పార్టీ తరఫున చర్చలు జరుపుతున్న సీనియర్ ఎంపీలకు స్టాలిన్ పలు సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చినట్టు తెలిసింది. ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు డీఎంకే త్వరలో ఆహ్వానాలు పంపనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ తీరుపై అనేక పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా సంప్రదింపులు జరిపే వ్యూహాన్ని స్టాలిన్ అమలు చేస్తున్నారని తమిళనాడులో రాజకీయ చర్చ ఊపందుకుంది.
ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పడబోయే కొత్త జట్టులో కాంగ్రెస్‌కు స్థానం ఇవ్వకూడదనే నిర్ణయానికి స్టాలిన్ వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా మూడో శక్తిగా నిలిచే లక్ష్యంతో, తమ రాష్ట్రాల్లో బలమైన పట్టు కలిగిన ప్రాంతీయ పార్టీలతో డీఎంకే సంప్రదింపులు ప్రారంభించబోతోందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
ఒకే వేదికపై కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు..
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ వ్యూహం ప్రధాన లక్ష్యంగా డీఎంకే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమి ఏర్పాటైనప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే, ఇప్పుడు అదే కూటమికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తుండటంతో, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఎలా రూపుదిద్దుకుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరిగింది.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో ఎంకే స్టాలిన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయాలు, ఇండియా కూటమి భవిష్యత్తుపై, అలాగే కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లోని పాత్రపై ఎంత ప్రభావం చూపుతాయన్నది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.







