న్యూఢిల్లీ:- సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో భాగంగా అమలవుతున్న త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. తొమ్మిదో తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం సరికాదని, దీనివల్ల విద్యార్థులపై అదనపు ఒత్తిడి పెరిగే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. కొత్త భాషను నేర్పాలనుకుంటే ఐదో లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయ (JNV)ల ఏర్పాటు సంబంధిత పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై కాకుండా, రాష్ట్రంలో JNVల స్థాపనకు సంబంధించినదే అయినప్పటికీ, దేశవ్యాప్తంగా అమలవుతున్న త్రిభాషా విధానంపై కోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయ (JNV)ల్లో త్రిభాషా విధానం అమలులో ఉంది. అయితే ఈ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో JNVలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ప్రతి జిల్లాలో ఒక JNV ఏర్పాటు చేయాలని మద్రాస్ హై కోర్ట్ ఇటీవల ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో JNVల ఏర్పాటు, త్రిభాషా విధానం అమలు, రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు వంటి అంశాలపై ధర్మాసనం పరిశీలన జరిపింది. తొమ్మిదో తరగతిలో మూడో భాషను ప్రారంభించడం విద్యార్థులకు భారంగా మారుతుందని, భాషా అభ్యాసం చిన్న వయసులోనే ప్రారంభమైతే మెరుగైన ఫలితాలు వస్తాయని కోర్టు సూచించింది. విద్యార్థుల మానసిక ఒత్తిడి, విద్యా భారం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

ఇదిలా ఉండగా, సీబీఎస్‌ఈలో త్రిభాషా విధానంపై ప్రత్యేకంగా విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ఈ విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం చూస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భాషా బోధన, త్రిభాషా విధానం అమలు, రాష్ట్రాల అభ్యంతరాలపై ఈ ధర్మాసనం సమగ్రంగా పరిశీలిస్తోంది.

తమిళనాడు JNVల వ్యవహారంలో ధర్మాసనం చేసిన తాజా వ్యాఖ్యలు, సూచనలు భవిష్యత్తులో త్రిభాషా విధానం అమలు విధానంపై, ముఖ్యంగా మూడో భాషను ఏ తరగతి నుంచి ప్రారంభించాలన్న అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలిచే అవకాశమున్నట్లు న్యాయవర్గాలు భావిస్తున్నాయి.