ఎన్డీఏకు టీఎంసీ(ఎం) గుడ్‌బై..

స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) పార్టీ వైదొలగుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని టీఎంసీ (ఎం) అధ్యక్షుడు జీకే వాసన్ మీడియాకు తెలియజేశారు.

పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య బాధ్యులతో సమగ్రంగా చర్చించిన అనంతరం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయించినట్లు జీకే వాసన్ వివరించారు. 12 ఏళ్ల క్రితం స్థాపితమైన తమ పార్టీ ఇప్పటివరకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ (ఎం) ఒంటరిగా బరిలో దిగాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని తెలిపారు.

ఎన్డీఏలో ప్రాధాన్యత లేదని ఆగ్రహం..

చైన్నె ఎగ్మోర్‌లో ఆదివారం జీకే వాసన్ అధ్యక్షతన టీఎంసీ (ఎం) అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మెజారిటీ నాయకులు ఎన్డీఏ కూటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ ఆధ్వర్యంలోని కూటమిలో తమ పార్టీకి దక్కాల్సిన కనీస ప్రాధాన్యత, గౌరవం లభించడం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుంచి తక్షణమే వైదొలగాలని జీకే వాసన్‌ను కోరినట్లు సమాచారం. మరికొందరు నేతలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాల వైపు చూడటం మంచిదని సూచించారు.

అవకాశవాద రాజకీయాలు పెరిగాయని విమర్శలు..

నాయకుల అభిప్రాయాలను విన్న అనంతరం జీకే వాసన్ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న కొందరు, ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ సాహసోపేతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన, వారే ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని తాను నమ్మడం లేదని జీకే వాసన్ అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ స్థిరంగా రాణించాలంటే బలమైన సంస్థాగత నిర్మాణంతో పాటు సరైన సంకీర్ణం అవసరమని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చాలా కాలం క్రితమే బలహీనపడిందని, టీఎంసీ (ఎం) ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా అంతర్గతంగా కొన్ని లోపాలు ఉన్న కారణంగా ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేకపోయామని వాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఉనికిని బలంగా చాటుకోవాలని భావిస్తున్నందునే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే వరకు టీఎంసీ (ఎం) స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, పార్టీ బలోపేతం దిశగా చర్యలు కొనసాగిస్తామని జీకే వాసన్ తెలిపారు.