రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: భారత్, అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించిన ఆయన, మోదీ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో యూఎస్ వాణిజ్య బృందం పర్యటన పూర్తయ్యాక ట్రంప్ మీడియాతో మాట్లాడారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తుది దశ చర్చల కోసం వచ్చిన యూఎస్ బృందం, జూన్ 1 నుంచి 4 వరకు నాలుగు రోజులపాటు భారత అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ చర్చల ఫలితంగా ఒప్పందం దాదాపు పూర్తయిన దశకు చేరుకుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
భారత వాణిజ్య విధానాలపై ట్రంప్ మరోసారి విమర్శలు చేశారు. అమెరికా విధానాల వల్ల భారత్ లాభపడిందని, అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు విధించేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు దృశ్యం పూర్తిగా మారిపోయిందని, ప్రస్తుతం భారత్ వల్ల యూఎస్ భారీగా లాభపడుతోందని ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
ఫిబ్రవరి 7న ట్రంప్, మోదీ ఫోన్ సంభాషణ అనంతరం ఇరు దేశాల మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారైన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాన్ని తొలగించడంతో పాటు, భారత్ విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని 18 శాతానికి తగ్గించేందుకు యూఎస్ అంగీకరించింది.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు..
అయితే ట్రంప్ ప్రభుత్వ ప్రతీకార సుంకాల విధింపు రాజ్యాంగ విరుద్ధమని యూఎస్ సుప్రీం కోర్టు ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చింది. దాంతో ట్రంప్, ముందున్న సుంకాల స్థానంలో అన్ని దేశాలపైనా ఏకరీతిగా 10 శాతం సుంకం విధించే నిర్ణయం తీసుకున్నారు. ఈ సుంకం 150 రోజులపాటు అమల్లో ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాలు మరోసారి చర్చలు ప్రారంభించాయి. భారత బృందం అమెరికా పర్యటన అనంతరం, తాజాగా యూఎస్ వాణిజ్య బృందం భారత్‌కు వచ్చి చర్చలు జరిపింది. డీల్ దాదాపు కుదిరినట్టేనని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం ఈ సందర్భంలో ప్రాధాన్యం సంతరించుకుంది.







