రాయలసీమ న్యూస్, తమిళనాడు డెస్క్:
అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమం..
24 గంటల్లోనే 14.5 లక్షల మంది నమోదు
చెన్నై : తమిళనాడులో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మరో రాజకీయ సంచలన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘వుయ్ ద పీపుల్’ పేరుతో ఆయన ప్రారంభించిన కొత్త రాజకీయ ఉద్యమానికి ప్రజల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ఉద్యమాన్ని ప్రకటించిన 24 గంటల్లోపే దాదాపు 14.5 లక్షల మంది ఆ ఉద్యమానికి సంబంధించిన వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు సమాచారం.
బీజేపీ అధిష్ఠానం తన రాజీనామాను ఆమోదించిన వెంటనే అన్నామలై సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందుకు వచ్చారు. తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను వివరించడంతో పాటు, ‘వుయ్ ద పీపుల్’ ఉద్యమాన్ని అధికారికంగా ప్రకటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించడంతో తమిళనాడు రాజకీయాల్లో చర్చలు వేడెక్కాయి. బీజేపీ నుంచి వైదొలిగిన ఆయన, స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పరచుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమానికి తొలి రోజే భారీ సంఖ్యలో నమోదులు జరగడం, రాష్ట్ర రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అన్నామలై ప్రారంభించిన ఉద్యమంలో బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నాగేంద్రన్ స్పందించారు. తమ పార్టీకి చెందిన కొంతమంది ఇన్చార్జులు, క్షేత్రస్థాయి నాయకులు కూడా ఆ ఉద్యమంలో చేరినట్లు తనకు తెలిసిందని ఆయన తెలిపారు. అలాంటి నాయకులపై ఎలాంటి క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే ఆలోచన ప్రస్తుతం పార్టీకి లేదని నాగేంద్రన్ స్పష్టం చేశారు. తెలిసో తెలియకో తొందరపడి ఆ ఉద్యమంలో చేరిన వారందరికీ తిరిగి రావడానికి అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
తన ఉద్యమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయని అన్నామలై ప్రకటించుకోవడంపై కూడా నాగేంద్రన్ స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణం, బీజేపీతో ఆయన భవిష్యత్ సంబంధాలపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.







