రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం:
సిబిఐతో విచారణ జరిపించాలి
: వైఎస్ జగన్
విజయవాడ : డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని, ఈ అక్రమాలపై సిబిఐ తో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలకే ప్రతీకగా నిలిచిందని ఆయన విమర్శించారు. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో చేసిన చర్య కూడా పెద్ద మోసమేనని ఆరోపించారు. లక్షలాది నిరుద్యోగుల నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారని పేర్కొన్నారు.
ఇంత ఘోరంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఆ నియామకాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందీ చంద్రబాబు ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు తొలి సంతకం పరిస్థితి అని విమర్శించారు.
మెగా డీఎస్సీ పేరును చంద్రబాబు స్వయంగా ప్రచారం చేసుకున్నారని, అలాంటి రిక్రూట్‌మెంట్‌కు ‘మెగా’ అనే పదం ఉపయోగించడానికి అర్హతే లేదని వైఎస్ జగన్ అన్నారు. 16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, ప్రశ్నాపత్రాల లీకులు బయటపడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మెగా డీఎస్సీ అని పిలవడం సముచితం కాదని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాసినా ఒక్క తప్పు కూడా జరగలేదని ఆయన గుర్తుచేశారు.
“రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్‌తో, ఒకే టైంలో 1లక్షా 30వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆ రోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు.”
“మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం.”
“మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.3 లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.”
ఇదే సమయంలో మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పరిశీలిస్తే, ఎన్నో అవకతవకల కారణంగా అభ్యర్థులు ఆవేదనతో ఉన్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన గోల్‌మాల్ వ్యవహారాల వల్ల ఎంతో మంది కన్నీళ్లు పెడుతున్నారని, అనేక కుటుంబాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయని ఆయన ఆరోపించారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై బాధితులకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.







