రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం బాబు
ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి నిన్న(శనివారం) శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సుమారు అరగంటకు పైగా పవన్‌తో చంద్రబాబు మాట్లాడారు. వైద్యుల సూచనలు, చికిత్స గురించి ఆరా తీశారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అవసరమైన అన్ని వైద్య సహాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరంతరం సమాచారం తెలుసుకుంటూ ఉండగా, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.







