రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి..
: కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీలో ఆక్వా, రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ముగ్గురు కేంద్రమంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్‌ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్‌ను సీఎం కోరారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ఏపీ నుంచి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆక్వా రంగంలో జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు.
అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ కార్యాలయం ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయటంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్య్స అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రాంతీయ కార్యాలయాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం మరో లేఖలో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్‌సింగ్‌ను కోరారు. ఈ ఏడాది జూన్ 5న విశాఖలో జరిగిన సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. రాజధాని పరిధిలోని నెక్కల్లులో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని దీనికోసం కేటాయించామన్నారు. తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. 2028 నాటికి ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణ కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతీయ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు.







