ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆస్పత్రికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆస్పత్రికి వచ్చి పరామర్శించినందుకు దేవేంద్ర ఫడణవీస్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నాయకులు కాసేపు ఆత్మీయంగా పలు కీలక విషయాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.