రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
‘ఫ్రైడే - డ్రైడే’ పకడ్బందీగా అమలు చేయాలి
: డిప్యూటీ సీఎం పవన్
వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు.
ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని.. అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని పవన్ ఆదేశించారు. ముఖ్యంగా వర్షపు నీరు, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవటం ద్వారా... దోమల వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, రోజు వారీ చెత్త సేకరణ శాస్త్రీయపద్ధతిలో నిర్వహించాలని, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ‘ఫ్రైడే - డ్రైడే’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని.. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులు, మైక్ అనౌన్స్ మెంట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణ ఉండాలని.. పైపు లైన్లలో లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు.







