ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ భుజం నొప్పితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి (రొటేటర్ కఫ్) శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో పవన్ విశాంత్రి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు.

అలాగే, పవన్ స్వగృహంలోని లైబ్రరీని గవర్నర్ నజీర్ సందర్శించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. రచయితలు, స్కాలర్స్, పబ్లిక్ పాలసీ నిపుణుల పుస్తకాలపై చర్చించారు. పవన్ అభ్యర్థనపై ఓ పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ చేశారు. ఆప్యాయంగా వచ్చి పరామర్శించిన గవర్నర్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.