రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని?
ఖరారు చేసిన అధినేత పవన్
అమరావతి: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని రమేశ్ పేరును డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించినట్లు సమాచారం.
2015 నుంచి జనసేనతో పాటు, తనతో లింగమనేని రమేశ్ ఉన్నారని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సమావేశంలో వివరించినట్లు తెలిసింది. లింగమనేని అభ్యర్థిత్వంపై శుక్రవారం సాయంత్రం ముహూర్తం చూసుకుని పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఒక స్థానం జనసేన కి కేటాయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కి, ఒకటి జన సేన కి కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాధవ్, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు , మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు. జనసేన అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల జాబితాను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.







