రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
: మంత్రి నారా లోకేశ్ ట్వీట్
లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశంపై కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో మరో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరాం రమేశ్‌ను ప్రశ్నిస్తూ వారి ఖాతాలను ట్యాగ్ చేశారు. లోక్‌సభ సీట్ల పెంపుపై గతంలో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ ప్రస్తావించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. ‘‘లోక్‌సభ స్థానాలు 543 నుంచి 1000కి పెంచాలని గతంలో ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ప్రణబ్ తప్పుచెప్పారా? రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకుందా?’’ అని లోకేశ్ ప్రశ్నించారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై సీఎం చంద్రబాబు దిల్లీలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని సీట్లను 50% మేర పెంచడం వల్ల దక్షిణాదికి ఎటువంటి నష్టమూ వాటిల్లదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను శశిథరూర్ ‘ఎక్స్’ వేదికగా ఖండించారు. ‘‘ప్రస్తుతం యూపీకి ఉన్న 80 మంది ఎంపీలు, కేరళకున్న 20 మంది ఎంపీల మధ్య పెద్ద తేడా లేదని మీకనిపిస్తుండవచ్చు. కానీ 50% సీట్ల పెంపు తర్వాత యూపీ ఎంపీలు 120కి పెరిగితే కేరళ ఎంపీలు 30కి చేరుతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది భారీ వ్యత్యాసానికి దారితీస్తుంది’’ అని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను జీతాల లెక్కలతో పోల్చుతూ పోస్ట్ చేశారు.
శశిథరూర్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (డీలిమిటేషన్) వల్ల ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రయోజనాలు లభిస్తాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌తో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందనే వాదనలో వాస్తవం లేదని.. ఎవరికీ అదనపు ప్రయోజనాలు లభించవని తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా 50% స్థానాల్ని పెంచే స్పష్టమైన నిబంధనతో కేంద్రం త్వరలో డీలిమిటేషన్ బిల్లు తీసుకురానుందని.. దీంతో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదన్నారు. జీతాల లెక్క వేరు.. ఓట్ల శాతం వేరని లోకేశ్ స్పష్టం చేశారు. జీతాల పెంపు సూత్రం ఇక్కడ వర్తించదని తెలిపారు. తాజాగా ప్రణబ్ ముఖర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’లో లోకేశ్ పోస్ట్ చేశారు.







