రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: అమరావతి : రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. గత రెండేళ్లలో కూడా ఒక్క రూపాయి మేరకైనా విద్యుత్ ధరలు పెంచలేదని తెలిపారు.
గొడ్డలి ప్రభుత్వం పాలనలో విద్యుత్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్ల వ్యవధిలోనే ఆ వ్యవస్థను గాడిన పెట్టగలిగామని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.
జగన్ ప్రభుత్వం అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని ట్రూ డౌన్గా మార్చి చరిత్ర సృష్టించామని రవి కుమార్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించి 13 పైసల మేర ట్రూ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన వివరించారు.
వచ్చే మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ధైర్యంగా చెబుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారులపై అదనపు భారం మోపకుండా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 6 లక్షల ఉచిత సోలార్ కనెక్షన్లు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని రవి కుమార్ చెప్పారు. దీతో పేద కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా, పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి, బయట నుంచి విద్యుత్ కొనుగోళ్లను తగ్గించామని మంత్రి తెలిపారు. సంప్రదాయేతర ఇంధన రంగంలో 160 జిగావాట్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని రవి కుమార్ వివరించారు. ట్రాన్స్మిషన్ నష్టాలు, సాంకేతిక ఇబ్బందులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా మరింత దృఢపరచే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.







