రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ..
వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ
ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైకాపా కార్యాలయంలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకుంటే.. పురుషులు చొక్కాలు చించుకున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే క్రమంలో కొంత మంది మహిళా కార్యకర్తల కాళ్లు పురుషులు తొక్కారు. కాళ్లు తొక్కుతున్నారని మహిళలు ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. దీంతో రెండు వర్గాలుగా మారిన వైకాపా క్యాడర్ పరస్పరం దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణ సమయంలో మహిళా కార్యకర్తలతో కొందరు పురుష కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఓ మహిళ కార్యకర్తపై వైసీపీ నేత చేయి కూడా చేసుకున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.







