రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
పార్టీ కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం
తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదు..: పవన్ కల్యాణ్
దిల్లీ: జనసేన పార్టీ స్థాపన వెనుక తన ఆలోచనల్లో దేశ సమగ్రత, శ్రేయస్సు మాత్రమే ఉన్నాయని, అధికారం గురించి ఆ సమయంలో ఎలాంటి లెక్కలు పెట్టుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన ప్రారంభ దశలోనే పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలపై కూడా స్పష్టత లేకుండానే తన ప్రయాణం మొదలైందని ఆయన చెప్పారు.
‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరిట దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ 12 ఏళ్ల ప్రయాణాన్ని ఆయన సమీక్షించారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయ్యేలోపు ఎన్నో పోరాటాలు చేశామని, పరాజయాలను కూడా ఎదుర్కొన్నామని ఆయన గుర్తుచేశారు.
మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల మధ్య కూడా జనసేన తన ప్రాథమిక సిద్ధాంతాలను వదలలేదని పవన్ కల్యాణ్ వివరించారు. ఏడు ప్రాథమిక సూత్రాల ఆధారంగా, నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతోనే పార్టీ ప్రజల్లోకి వెళ్లి విజయాలు సాధించిందని చెప్పారు. ఈ క్రమంలో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను జనసేన గెలుచుకోవడం తమ విధానాలకు ప్రజల మద్దతుకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ ప్రారంభ దశలో లక్ష మంది సభ్యత్వంతో మొదలైన జనసేనకు ప్రస్తుతం 20 లక్షలకుపైగా సభ్యత్వాలు నమోదయ్యాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది పార్టీకి చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక్కరోజులో పూర్తయ్యే పని కాదని, ఆ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకంగా నిలవలేదని, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన విధానంపై మాత్రమే ఆవేదన వ్యక్తం చేశామని ఆయన గుర్తుచేశారు.
విభజన ప్రక్రియలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు అసంతృప్తి, అశాంతికి దారితీసిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పార్టీ ధోరణిలో మార్పు కనిపించలేదని, జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే దానికి తాజా ఉదాహరణగా పేర్కొన్నారు.
దిల్లీపై గట్టి మాటలు మాట్లాడే కొంతమంది నేతలు అక్కడికి వెళ్లిన తర్వాత వెనక్కి తగ్గుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. చాలాసార్లు మనమే మన సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకుంటామని, ప్రతి వ్యక్తి సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి కలిగినవాడేనని ఆయన అన్నారు.
“మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 7 ప్రాథమిక సూత్రాలను వదల్లేదు. నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను సాధించాం. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీకి 20 లక్షలకుపైగా సభ్యత్వాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల నుంచి వేల మంది పార్టీలో చేరుతున్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు. 2014లో ఏపీని విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశాం. విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు అసంతృప్తిని, అశాంతిని సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి మారలేదు. జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ. దిల్లీ మెడలు వంచుతాం, తడాఖా చూపిస్తామంటూ చాలామంది పెద్దలు మాటలు చెబుతారు. వాస్తవానికి అలాంటి నేతలు దిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు. చాలాసార్లు మనకు మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావొచ్చు. ఈ మధ్య కాక్రోచ్ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది. చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయి” అని పవన్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదు..
తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదని పవన్ వెల్లడించారు. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుపైనే ఆవేదన వెలిబుచ్చామని వివరించారు. తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదన్నారు. కాంగ్రెస్ విభజించిన తీరు.. అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆస్తుల పంపిణీ, తదితర సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఢిల్లీ మెడలు వంచుతామని చాలా మంది మాట్లాడుతున్నారని.. కానీ ఢిల్లీకి రాగానే ఎవరి నోర్లు పెగలవని దుయ్యట్టారు. దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రం ఢిల్లీ అని తెలిపారు. స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు ఈ గడ్డ నిలయమన్నారు. రాజ్యాంగం పుట్టిన చోటు కాబట్టే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల కీలక నాయకులు హాజరయ్యారు.







