రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
పోక్సో పకడ్బందీగా అమలు చేయండి!
తెలంగాణ సీఎం రేవంత్ కు పవన్ కల్యాణ్ లేఖ..
పోక్సో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృతమైన లేఖ రాశారు. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు పలు కీలక ప్రతిపాదనలను ఆయన లేఖలో పొందుపరిచారు. తెలంగాణలో జరిగిన షాబాద్ ఘటనను ఉదాహరణగా ప్రస్తావించిన పవన్, బెయిల్‌పై విడుదలైన నిందితుడు ఆరుగురిని హత్య చేసిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. పోక్సో కేసుల్లో నిందితుల బెయిల్‌ను మరింత కఠినంగా పరిశీలించాలని, బాధితులు మరియు వారి కుటుంబాలకు పటిష్టమైన భద్రత కల్పించాలని సూచించారు.
పోక్సో కేసులను దర్యాప్తు చేసే అధికారులకు తప్పనిసరిగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. బాలలతో సున్నితంగా వ్యవహరించడం, ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, కేసుల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అవసరమని పేర్కొన్నారు. బాధితుల వైద్య పరీక్షలను 24 గంటల్లో పూర్తి చేయాలని, SAFE కిట్ల వినియోగంతో పాటు DNA, FSL నివేదికలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు పవన్.. ఘటన స్థలాన్ని ఫొటోలు, వీడియోలతో తప్పనిసరిగా నమోదు చేయాలని, పోక్సో కేసుల్లో దర్యాప్తు, ఛార్జిషీట్ గడువులోగా పూర్తి కావాలని పవన్ పేర్కొన్నారు. సాధారణ కేసులను 60 రోజుల్లో, క్లిష్టమైన కేసులను 90 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ కేసులను జిల్లా ఎస్పీలు, రేంజ్ ఐజీలు ప్రతి నెల సమీక్షించాలని సూచించారు.
ప్రతి పోక్సో కేసులో బాధితుల రక్షణ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలని, అవసరమైతే పోలీసు పహారా, ఎస్కార్ట్ సౌకర్యం కల్పించడంతో పాటు వన్‌స్టాప్ సెంటర్లతో అనుసంధానం చేయాలని పవన్ ప్రతిపాదించారు. బెదిరింపులకు పాల్పడే లేదా నేర చరిత్ర ఉన్న నిందితులపై రౌడీషీట్లు తెరవాలని సూచించారు. పోక్సో కేసుల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) విడుదల చేయాలని, జిల్లా, రేంజ్, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసు, ప్రాసిక్యూషన్, మహిళా-శిశు సంక్షేమ శాఖల మధ్య సంయుక్త సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కూడా సూచించారు.
పోక్సో కేసుల్లో ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయకుండా వెంటనే FIR నమోదు చేయాలని, FIR నమోదు ఆలస్యం చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, ప్రార్థనా మందిరాల్లో పిల్లలపై లైంగిక నేరాల నివారణకు తప్పనిసరి రిపోర్టింగ్ వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. పిల్లలపై లైంగిక నేరాలను సాధారణ పరిపాలనా అంశంగా కాకుండా అత్యంత ప్రాధాన్యంతో చూడాలని పవన్ స్పష్టం చేశారు. తాను సూచించిన చర్యల అమలుపై 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పోక్సో చట్టం సమర్థవంతమైన అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి వేగవంతమైన, ఖచ్చితమైన న్యాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ సిఎస్, డీజీపీకి లేఖ..
అదేవిధంగా రాష్ట్రంలో పోక్సో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) మరియు డీజీపీకి లేఖ రాశారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల కేసుల్లో సమయపాలనతో దర్యాప్తు, బాధితుల రక్షణ, సాక్ష్యాల పరిరక్షణ, కేసుల పర్యవేక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రతి చిన్నారికి భద్రత, గౌరవం, భయరహిత జీవనం రాజ్యాంగబద్ధమైన హక్కు అని పవన్ లేఖలో పేర్కొన్నారు. పోక్సో కేసులను అత్యున్నత ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కూడా ఆయన అధికారులకు గుర్తుచేశారు.
నెల్లూరు జిల్లా రెహ్మతాబాద్ దర్గా వ్యవహారానికి సంబంధించి ముస్లిం మత పెద్దలు, స్థానికులు, భక్తులు, ముస్లిం సమాజ సభ్యుల నుంచి తనకు వినతులు అందినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పోక్సో కేసు ఎదుర్కొంటున్న సజ్జాదా నషీన్ ఇప్పటికీ ఆధ్యాత్మిక బాధ్యతలు నిర్వహిస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని వక్ఫ్ బోర్డు, జిల్లా యంత్రాంగానికి పోలీసులు అధికారికంగా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. అలాగే పోక్సో కేసుల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులను బెదిరించే ఘటనలను తీవ్రంగా పరిగణించాలని, అలాంటి చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.







