ఫడణవిస్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..

పులుల బహుకరణపై కృతజ్ఞతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కి రెండు ఆడపులులు ఇస్తున్నందుకు ఫడణవిస్‌‌కి.. పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరు మాట్లాడారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి రెండు ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఈ సమావేశంలో వారు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీలోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సీఎం దేవేంద్ర ఫడణవిస్‌ అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.