సండే స్పెషల్ కోసం ఇంట్లోనే రెస్టారెంట్ స్థాయి వంటకం చేయాలనుకునే వారికి చికెన్ ఖోర్మా మంచి ఎంపికగా నిలుస్తుంది. హైదరాబాద్ ముస్లిం పెళ్లిళ్లలో సాధారణంగా వడ్డించే ఈ చికెన్ ఖోర్మా, క్రీమీ గ్రేవీ, ఘాటు మసాలా, రిచ్ ఫ్లేవర్‌లతో ప్రత్యేక రుచిని ఇస్తుంది. ఒకసారి రుచి చూసిన వారికి మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఈ వంటకం ఉంటుందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు.

ఈ రెసిపీకి కావలసిన పదార్థాల్లో ప్యాకెట్ పొట్లి మసాలా ముఖ్యమైనది. ఇందులో 25 నుంచి 30 రకాల మసాలాలు ఉంటాయి. అర లీటరు నీటిలో ఈ పొట్లి మసాలాను వేసి, కొద్దిగా కొత్తిమీర కలిపి మరిగించాలి. నీరు సుమారు 350 మిల్లీ లీటర్లకు తగ్గే వరకు దగ్గర పడనివ్వాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి.

మసాలా పేస్ట్ కోసం మరో పాన్‌లో వేరుశెనగలు మూడు టేబుల్ స్పూన్లు, బాదం రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 15, చిరోంజి ఒక టేబుల్ స్పూన్, గసగసాలు ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి నాలుగు స్పూన్లు వేసి రంగు మారే వరకు సన్నని మంటపై వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి బరువుగా పేస్ట్‌లా బ్లెండ్ చేసుకోవాలి.

తర్వాత మరో పాన్‌లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో యాలకులు నాలుగు, లవంగాలు, రెండు ముక్కల దాల్చినచెక్క, షాహీజీరా ఆఫ్ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, తయారుచేసుకున్న పప్పుల పేస్ట్‌ను జోడించాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ, అర కప్పు నీరు పోసి మూతపెట్టి మసాలా బాగా వేగనివ్వాలి.

నూనె పైకి తేలిన తర్వాత అరకిలో చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. 10–15 నిమిషాలు మసాలాలో చికెన్ ఉడికిన తర్వాత ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న పొట్లి మసాలా నీటిని వడకట్టి జోడించాలి. మళ్లీ మూతపెట్టి 15–20 నిమిషాలు ఉడికించాలి.

చివరగా నూనె పైకి తేలిన సమయంలో ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు మరిగించాలి. ఈ చికెన్ ఖోర్మాలో నూనె కొంచెం ఎక్కువగా ఉండటం వలన గ్రేవీకి ప్రత్యేక రుచి, టెక్స్చర్ వస్తుంది.

జీరా రైస్, బగారా రైస్, రోటీ, నాన్, అన్నంతో ఈ చికెన్ ఖోర్మా అద్భుతమైన కాంబినేషన్‌గా ఉంటుంది. ఇంట్లో స్పెషల్ డేలను మరింత మెమొరబుల్‌గా మార్చుకోవాలనుకునే వారు ఈ ఆదివారం వంటి సెలవు రోజుల్లో ఈ రెసిపీని ట్రై చేయవచ్చు.