రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
టీ20 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లోనే టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. అదీనూ ఐర్లాండ్ వంటి జట్టు చేతిలో పరాజయం చవిచూసింది. అయితే.. పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడం వల్లే తాము ఓడినట్లు టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వ్యాఖ్యానించాడు. ఐర్లాండ్‌పై 49 పరుగులు చేసిన అభిషేక్ శర్మనే భారత్ తరఫున టాప్ స్కోరర్.
‘‘పిచ్ పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడుతున్నామనేదే చాలా కీలకం. ప్రస్తుత కాలంలో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాం. ప్రాక్టీస్ సెషన్లు దొరికినప్పుడు లేదా పరిస్థితులకు అలవాటు పడే అవకాశం ఉన్నప్పుడు జట్టుగా ముందుకు వచ్చి వాటికి అనుగుణంగా త్వరగా మారాలి. బలమైన జట్టుగా మేం పరిస్థితులకు త్వరగా సర్దుకుపోవాలి. కానీ, ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో అది సాధ్యపడలేదు’’ అని అభిషేక్ తెలిపాడు.
అది హాఫ్ సెంచరీ కాదు..
ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో సంజు శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), శ్రేయస్ అయ్యర్ (3) త్వరగానే పెవిలియన్‌కు చేరారు. మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం దూకుడుగా ఆడాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 20 బంతుల్లో 49 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే, 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసినట్లు తొలుత వచ్చింది. కానీ, అభిషేక్ ఎదుర్కొన్న ఐదో బంతికి సింగిల్ రన్ లెగ్‌బై రూపంలో వచ్చింది. దానిని అభిషేక్ ఖాతాకు యాడ్ చేయడంతో.. అదనంగా ఒక పరుగు వచ్చి చేరింది. ఆ రన్ లేకపోవడంతో 49 పరుగులే అభిషేక్ చేసినట్లైంది.







