రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: టీ20ల్లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన టీం ఇండియా .. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమి చవిచూడడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ అనూహ్యంగా పరాజయంపాలైంది. అంతేకాకుండా ఇది ద్వితీయ శ్రేణి జట్టు కూడా కాదు. ప్రధాన ఆటగాళ్లతోనే బరిలోకి దిగినా పరాభవం తప్పించుకోలేకపోయింది.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 ఆదివారం బెల్‌ఫాస్ట్‌లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి తమ అసలు సత్తా చూపించాలని టీం ఇండియా పట్టుదలతో ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ ఇయర్ నాయకత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత్ ఇలాంటి ఫలితాన్ని నమోదు చేయడం జట్టుకు, అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది.
తొలి టీ20లో ఐర్లాండ్ బ్యాటింగ్ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపనట్టే కనిపించింది. అయితే చివరికి 182 పరుగుల భారీ స్కోరు చేసింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారత్ ఛేదనలో 148 పరుగులకే కుప్పకూలింది. టార్గెట్ సాధించాల్సిన సమయంలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.
ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ ఇయర్ తో పాటు సంజు శాంసన్ , ఇషాన్ కిషన్ ఘోరంగా విఫలమయ్యారు. మధ్యవరుసలో తిలక్ వర్మ , దుబయ్ కొంతసేపు నిలబడినా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 49 పరుగులు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో బ్యాటర్లలో కనీసం ఇద్దరు ముగ్గురు పెద్ద స్కోర్లు చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో ప్రసాద్ కృష్ణ పూర్తిగా తేలిపోయాడు. అతడు వేసిన నాలుగు ఓవర్లలో వికెట్ తీసుకోకుండా 57 పరుగులు ఇచ్చాడు. మరో ఇద్దరు పేసర్లు హర్షిత్ రానా , అర్షదీప్ సింగ్ మాత్రం ఆకట్టుకున్నారు. స్పిన్నర్ క్సర్ పటేల్ ప్రదర్శన కూడా పర్వాలేదనిపించింది. అయినప్పటికీ ఐర్లాండ్ బ్యాటర్లను అదుపులో పెట్టేందుకు బౌలర్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
టీ20 లీగ్స్ అనుభవంతో ఐర్లాండ్ బ్యాటర్లు రాటుదేలినవారు. ఆ జట్టుకు బ్యాటింగ్‌లో కెప్టెన్ టక్కర్ , హరీ టెక్టర్ , దెలనీ , డోసీక్రెల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో హల్లార్డ్ , హుంఫ్రీక్స్ , మూన్ద్ర ప్రధాన బలంగా నిలుస్తున్నారు. వీరిని ఎదుర్కొనేలా భారత బౌలర్లు, బ్యాటర్లు రెండో మ్యాచ్‌కు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నట్టు జట్టు వర్గాలు సూచిస్తున్నాయి.
తొలి టీ20లో అవకాశం దక్కని 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కి రెండో మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అతణ్ని జట్టులోకి తీసుకోవాలంటే సంజు శాంసన్ , ఇషాన్ కిషన్ లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. జట్టు కూర్పులో మార్పులు చేసి, బౌలింగ్ దాడిని బలోపేతం చేస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.







