రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో కీలక పోరులో ఓటమి పాలై సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు, తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం రాత్రి 7 గంటలకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ప్రస్తుతం భారత్ పరిస్థితి క్లిష్టంగా మారింది. సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలవడం తప్పనిసరి. చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉండగా, ఆ బలమైన జట్టును ఓడించడం అంత తేలిక కాదన్నది జట్టు వర్గాల అంచనా. అంతేకాక, ఆ మ్యాచ్‌లో గెలిచినా పెద్ద తేడాతో విజయం సాధించడం కష్టసాధ్యమనే భావన ఉంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై మాత్రం ఘన విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోవడం భారత్‌కు అత్యవసరం. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లలో ఏదో ఒకదానితో విజయాల్లో భారత్ సమంగా నిలిచినా, నెట్‌రన్‌రేట్‌లో మెరుగ్గా ఉండడం సెమీస్ రేసులో కీలకంగా మారనుంది. అందుకే బంగ్లాపై భారీ తేడాతో గెలవడమే భారత జట్టు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బలహీన నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌ను మినహాయిస్తే, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో టాప్ ఆర్డర్ విఫలమైంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ ఫామ్‌లో ఉన్నప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ మరింత జోరు అందుకోవాల్సిన అవసరం ఉంది. వీరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ కలిసి పెద్ద ఇన్నింగ్స్ ఆడితేనే భారత్ కోరుకున్న భారీ విజయం సాధించే అవకాశం ఉంటుంది.
బౌలింగ్ విభాగంలో తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రస్తుతం నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచింది. అయితే పేస్ బౌలింగ్‌లో మాత్రం భారత్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఈ టోర్నీలో ఆ జట్టు నెదర్లాండ్స్‌తో పాటు పాకిస్థాన్‌ను కూడా ఓడించి మంచి ఊపులో ఉంది. బ్యాటింగ్‌లో నిగర్ సుల్తారా, శోభన మోస్తరీ, షోర్నా అక్తర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో మారుఫా, సంజన, రితు, రబేయా, నహిదా ప్రదర్శన కూడా మెరుగ్గానే ఉంది.
ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్‌ను ప్రత్యర్థిగా ఎంత మాత్రం తక్కువ అంచనా వేయకుండా, పూర్తి జాగ్రత్తతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ విజయంతో నెట్‌రన్‌రేట్‌ను పెంచుకోవాలన్న లక్ష్యంతో టీమ్ ఇండియా మైదానంలోకి అడుగుపెట్టనుంది.







