ఐపీఎల్‌ ముగిసిందని క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ప్రారంభించిన టీజీ20 లీగ్‌ రూపంలో మరో క్రికెట్‌ పండుగకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం, వారికి ఐపీఎల్‌, టీమ్‌ఇండియా దిశగా దారులు చూపడం ఈ లీగ్‌ ప్రధాన లక్ష్యంగా హెచ్‌సీఏ ప్రకటించింది.

ఆదివారం సాయంత్రం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభోత్సవంతో టీజీ20 తొలి సీజన్‌ తెరలేపనుంది. అనంతరం రాత్రి 7.15 గంటలకు పాలమూరు స్ట్రైకర్స్‌, అన్విత ఖమ్మం ఏసెస్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. మొత్తం 22 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 32 మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లకూ ఉప్పల్‌ స్టేడియమే ఆతిథ్యం ఇస్తుంది.

లీగ్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ సహా మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌ దశలో ప్రతి జట్టు మిగతా ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్ర నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. జూలై 7న లీగ్‌ దశ ముగియగా, జూలై 9 నుంచి ప్లేఆఫ్స్‌ ప్రారంభమవుతాయి. జూలై 12న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. మ్యాచ్‌లలో సగం మధ్యాహ్నం 2.15 గంటలకు, మిగతా సగం రాత్రి 7.15 గంటలకు ఆరంభమవుతాయి.

దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, కేరళలో స్థానిక టీ20 లీగ్‌లు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఆ లీగ్‌ల్లో మెరిసిన పలువురు ఆటగాళ్లు రాష్ట్ర జట్లకు, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు ఎంపికై జాతీయ స్థాయికి ఎదిగారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్నేళ్ల క్రితమే లీగ్‌ ప్రారంభమైంది. తెలంగాణలో మాత్రం ఆలస్యంగా ఇప్పుడు టీజీ20 రూపంలో లీగ్‌ మొదలవుతోంది. ఇక్కడ మెరిసే కుర్రాళ్లపై ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే వివిధ స్థాయిల్లో హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించవచ్చని హెచ్‌సీఏ అంచనా వేస్తోంది.

ఎనిమిది జట్ల నుంచి మొత్తం 160 మంది యువ క్రికెటర్లు ఈ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మ్యాచ్‌లు స్టార్‌ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఆదివారం ప్రారంభోత్సవ వేడుకలు సాయంత్రం 5.30 గంటలకు సంగీత దర్శకుడు తమన్‌ ప్రదర్శనతో మొదలవుతాయి. అనంతరం లేజర్‌ షో, క్రాకర్స్‌ షోతో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. తర్వాత ఎనిమిది జట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చాక టీజీ20 ట్రోఫీని ఆవిష్కరిస్తారు. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌, టీజీ20 బ్రాండ్‌ అంబాసడర్‌ విజయ్‌ దేవరకొండ క్రికెట్‌ ఆడి టోర్నీని అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఇటీవలి ఆటగాళ్ల వేలంలో టీమ్‌ఇండియా క్రికెటర్‌ తిలక్‌ వర్మను మెదక్‌ ఫాల్కన్స్‌ అత్యధికంగా 33 లక్షల రూపాయలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత్‌ ‘ఎ’ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతడు టీజీ20లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరో భారత ఆటగాడు, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను వరంగల్‌ వారియర్స్‌ 14 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఈ నెల 26 నుంచి సిరాజ్‌ జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం తెలిపింది.