భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే సీజన్‌ నుంచి అతడు దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నట్టు జట్టు వర్గాల నుంచి సమాచారం లభించింది.

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. అంతకుముందు రెండు సీజన్లలో కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్‌ దశను చేరుకోలేకపోయింది. వరుసగా నిరాశాజనక ఫలితాలు రావడంతో కోచింగ్‌ బృందంలో మార్పులు చేయాలని దిల్లీ యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రస్తుత కోచింగ్‌ స్టాఫ్‌లో ఉన్న వేణుగోపాల్‌రావు, హేమాంగ్‌ బదాని, మునాఫ్‌ పటేల్‌లను తప్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని సమాచారం. వారి స్థానంలో కొత్త కోచ్‌లను నియమించేందుకు ఫ్రాంచైజీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.

యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ వంటి పలువురు స్టార్‌ క్రికెటర్లకు వ్యక్తిగత మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. ఫామ్‌ కోల్పోయిన సమయంలో రిషబ్‌ పంత్‌ కూడా యువరాజ్‌ సలహాలు తీసుకున్నాడు. పలువురు యువ క్రికెటర్ల ఆటతీరు మెరుగుపడటంలో యువరాజ్‌ కీలక పాత్ర పోషించినట్టు క్రికెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లలో యువరాజ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచి భారత విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో మొత్తం 132 మ్యాచ్‌లు ఆడిన అతడు 2019లో అన్ని రకాల క్రికెట్‌ నుంచి విరమణ ప్రకటించాడు.

ఇక దిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీని నియమించే అవకాశమున్నట్టు జట్టు వర్గాలు సూచిస్తున్నాయి. గంగూలీ ఇప్పటికే గతంలో ఈ ఫ్రాంచైజీతో పనిచేసిన అనుభవం కలిగి ఉండటం గమనార్హం.

మరోవైపు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనే ఆసక్తిని దిల్లీ ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లఖ్‌నవూ జట్టు పేలవ ప్రదర్శన, ఫలితంగా పంత్‌ ఆ జట్టు కెప్టెన్సీ కోల్పోవడం నేపథ్యంలో అతడిని లఖ్‌నవూ నుంచి కొనుగోలు చేయాలని దిల్లీ యాజమాన్యం భావిస్తున్నట్టు క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

లఖ్‌నవూను పంత్‌ వీడటం దాదాపు ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో, అతడిని తిరిగి దిల్లీ జెర్సీలో చూడాలనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. యువరాజ్‌ సింగ్‌ కోచింగ్‌, గంగూలీ పరిపాలనా అనుభవం, పంత్‌ దూకుడు – ఇవన్నీ కలిస్తే దిల్లీ క్యాపిటల్స్‌ భవిష్యత్‌ సీజన్లలో బలమైన జట్టుగా నిలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.