రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ద్రవిడ గడ్డపై అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం..
‘వి ఆర్ ద లీడర్స్’తో దళపతి విజయ్ ఫార్ములా
తమిళనాడు రాజకీయాల్లో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అన్నామలై తాజా రాజకీయ అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన బీజేపీకి రాజీనామా చేసి, కొత్త పార్టీ వైపు అడుగులు వేయడం వేగంగా జరిగిపోయింది. అయితే సాధారణంగా కనిపించేలా ముందుగా పార్టీని ప్రకటించి, తర్వాత కేడర్‌ను చూసుకునే పద్ధతికి భిన్నంగా అన్నామలై పూర్తిగా కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే అనే రెండు ద్రవిడ పార్టీలే తమిళనాడులో రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచాయి. కానీ తాజాగా సినీ నటుడు దళపతి విజయ్ స్థాపించిన పార్టీకి ప్రజలు ఇచ్చిన మద్దతు, ముఖ్యంగా యువ ఓటర్ల స్పందన, అక్కడి రాజకీయ సమీకరణాలను మార్చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే విజయ్ సీఎం పదవిని దక్కించుకోవడం ఈ మార్పుకు సంకేతంగా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో యువతలో తనకు ఉన్న క్రేజ్‌ను రాజకీయంగా మలచుకోవాలని అన్నామలై నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ముందే ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ద్వారా దాదాపు ఎనిమిదేళ్ల పాటు క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలంగా తయారు చేసుకున్నారు. అదే ఆయనకు తొలి ఎన్నికల్లోనే భారీ విజయాన్ని అందించింది. ఈ మోడల్‌ను గమనించిన అన్నామలై, దానికంటే ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో అన్నాడీఎంకే ఒత్తిడికి లోనై అన్నామలైను పక్కన పెట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే రావడం, 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు 12 శాతం ఓట్లు దక్కడం పార్టీకి, అన్నామలైకి కొత్త లెక్కలు చూపించింది. యువతలో తనకు ఉన్న ఆదరణ, ఓటు శాతం పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ నాయకులతో జరిగిన చర్చల్లో కూడా అన్నామలై తనదైన రాజకీయ దారిని ఎంచుకోవడంపైనే మొగ్గు చూపినట్లు సమాచారం.
ఇప్పుడు ఆయన ‘వి ఆర్ ద లీడర్స్’ పేరుతో ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ద్వారా క్షేత్రస్థాయి నాయకులకు పద్ధతిగా శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక. ప్రజలకు సేవ చేయాలనుకునే నాయకుడిలో ఉండాల్సిన లక్షణాలు, ప్రజలతో ఎలా మమేకం కావాలి, ఎలా వ్యవహరించాలి వంటి పది కీలక అంశాలపై ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ ట్రైనింగ్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే సంఘంలో సభ్యత్వం కల్పిస్తారు. తర్వాత వీరిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి పంపి, అన్నామలై సిద్ధాంతాలు, రాజకీయ దిశను విస్తృతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అన్నామలైకు తమిళనాడులో సినీ తారలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత, హిందూ ఓటర్లలో ఆయనకు గట్టి మద్దతు ఉన్నట్లు అంచనా. తమిళనాడులో బీజేపీ అవకాశాలు తగ్గుతున్న ఈ సమయంలో, తన వ్యక్తిగత ఇమేజ్, హిందూ ఓటు బ్యాంక్, ‘వి ఆర్ ద లీడర్స్’ ద్వారా తయారవుతున్న కేడర్‌ను ఆధారంగా చేసుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తనదైన ముద్ర వేయాలని అన్నామలై రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక ఈ మొత్తం వ్యూహానికి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు కూడా ఉండొచ్చన్న ప్రచారం అక్కడి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దళపతి విజయ్ తరహా గ్రౌండ్ వర్క్‌తో, తనదైన కొత్త పంథాతో ద్రవిడ రాజకీయాల ఏకపక్షాధిపత్యానికి సవాలు విసురుతున్న అన్నామలై ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, రాబోయే నెలల్లో స్పష్టమవనుంది.







