రాయలసీమ న్యూస్, తమిళనాడు డెస్క్: NEET పరీక్ష పేపర్ లీకేజీలు, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో తమిళనాడులో అధికార పక్షం అయిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ నాయకత్వంలోని TVK, NEET పరీక్షలో జరుగుతున్న అక్రమాలను మాత్రమే కాదు, ఈ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టంగా డిమాండ్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో NEETకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు ఉధృతమవుతున్న సమయంలో, NEETను పూర్తిగా రద్దు చేయడమే తమ రాజీలేని, స్పష్టమైన విధానమని TVK ప్రకటించింది. వైద్య విద్యకు సంబంధించిన అన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారాలు ఇవ్వాలని పార్టీ స్పష్టం చేసింది.
గత 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే NEETను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని, ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన DMKపై TVK పరోక్షంగా విమర్శలు గుప్పించింది. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే “కపట రాజకీయం” తాము ఎప్పటికీ చేయబోమని పార్టీ స్పష్టంగా తెలిపింది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ‘ఉమ్మడి జాబితా’లో (Concurrent List) ఉన్న విద్యా రంగాన్ని తిరిగి ‘రాష్ట్ర జాబితా’లో (State List)కి మార్చాలని TVK డిమాండ్ చేసింది. దీనికి ఏవైనా చట్టపరమైన లేదా సాంకేతికపరమైన అడ్డంకులు ఉంటే, తాత్కాలిక పరిష్కారంగా ఒక ప్రత్యేక ఉమ్మడి జాబితాను ఏర్పాటు చేసి, వైద్య విద్యతో సహా మొత్తం విద్యా రంగంపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు కల్పించాలని కోరింది.
ఇతరుల కష్టాన్ని, ఆలోచనలను, పోరాటాలను తమ ఖాతాలో వేసుకుంటూ స్వార్థ రాజకీయం చేసేవారు TVKను విమర్శించడం తక్షణమే ఆపాలని పార్టీ హితవు పలికింది. NEET రద్దు, వైద్య విద్యపై రాష్ట్రాల నియంత్రణ వంటి అంశాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని TVK స్పష్టం చేస్తోంది.







