రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి, ఉద్యమకారుడు డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ఏర్పాటు చేసిన స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు అందెశ్రీకు ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం భార్య మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తుల సమక్షంలో స్మృతి వన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
తెలంగాణ గడ్డపై ఆధిపత్యం ప్రదర్శించాలనుకునే, ఈ భూమిని ఆక్రమించి దోచుకోవాలనుకునే ఏ తరమైనా ఎదురొస్తే, అలాంటి పరిస్థితుల్లో అందెశ్రీలాంటి వ్యక్తులు మళ్లీ పుడతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమంలో రెక్కలు ముక్కలు చేసుకొని, గొంతు, జీవితాలను ఉద్యమానికి అంకితం చేసిన తొమ్మిది మందిని గుర్తించి, పార్టీని, జెండాను చూడకుండా సత్కరించి ప్రతి కుటుంబానికి ఒక కోటి రూపాయలు అందజేశామని, అది తన సొమ్ము కాదని, ప్రజల సొమ్ము అని ముఖ్యమంత్రి వివరించారు.
అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ”, “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” వంటి ఎన్నో పాటలను ముఖ్యమంత్రి స్మరించారు.
పదాలపై పదాలు పేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో అందెశ్రీ రగిల్చిన ఉద్యమ స్ఫూర్తి, ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డను ఉద్యమం వైపు నడిపించిన ఉద్యమకారుడని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024 జూన్ 2న “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా జాతికి అంకితం చేసిన సందర్భంలో, అందెశ్రీ భావోద్వేగానికి లోనైన విధానాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.







