రాయలసీమ న్యూస్, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో భూపరిపాలన, రెవెన్యూ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ గారు, CCLA చీఫ్ సెక్రటరీ శ్రీమతి జి. జయలక్ష్మి గారు సంయుక్తంగా నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రీ సర్వే పనులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ, 22A అమలు, PGRS, ORCMS, రెవిన్యూ వన్ , Census తదితర అంశాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు జరిగిన పనుల స్థితిగతులను కలెక్టర్లు వివరించారు.
భూ సర్వే పనుల్లో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు, భూస్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించినట్లు సమాచారం. పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసి, అర్హులందరికీ సమయానికి అందేలా చూడాలని సూచించారు.

22A కింద నిషేధిత ఆస్తుల జాబితా, నమోదు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ఉపయోగపడే PGRS వ్యవస్థ పనితీరుపై కూడా సమీక్ష జరిగింది. ORCMS ద్వారా ఆన్‌లైన్ రెవెన్యూ సేవల అందుబాటు, రెవిన్యూ వన్ ద్వారా వివిధ సేవలను ఒకే వేదికపై సమీకరించే చర్యలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న సెన్సస్ పనుల పురోగతిని కూడా ఈ సందర్భంగా పరిశీలించారు. డేటా సేకరణ, నమోదు, ధృవీకరణ ప్రక్రియల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరై, తమ జిల్లాలో జరుగుతున్న భూపరిపాలన, రెవెన్యూ సంబంధిత కార్యక్రమాలపై వివరాలు అందించారు.
సమావేశం ముగింపు సందర్భంగా, నిర్ణయించిన లక్ష్యాలను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.













