రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన దర్శనం కల్పించడం టీటీడీ ప్రధాన లక్ష్యమని సంస్థ స్పష్టం చేసింది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
సర్వదర్శనం, నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వర్చువల్ సేవలు, ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలపై భక్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
ఇటీవలి కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పరిమితిని మించి పెరుగుతున్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో భారీగా తరలివచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నుంచి భక్తులకు కేటాయించిన సమయానికి శ్రీవారి దర్శనం కల్పించే వరకు అన్ని విభాగాలు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
అధికారులు, ఉద్యోగులతోపాటు భద్రత, విజిలెన్స్, అన్నప్రసాదం, తాగునీటి విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. నిర్దేశిత సర్వదర్శనంపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
శ్రీవారి దర్శనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని భక్తులను మోసం చేసే దళారులపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని టీటీడీ తెలిపింది. దర్శనం, గదుల కేటాయింపు పేరుతో మోసాలకు పాల్పడిన దళారులపై ఈ సంవత్సరం ఇప్పటివరకు 30 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అలాగే ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో దళారులైనా, సిబ్బందైనా ఎవరిపైనా రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు, పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ వెబ్‌సైట్‌లను ఈ సంవత్సరం ఇప్పటివరకు గుర్తించినట్లు టీటీడీ వెల్లడించింది. వీటిపై 2 క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, సంబంధిత సంస్థల సహకారంతో ఆ వెబ్‌సైట్‌లన్నింటినీ తొలగించినట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లు, లింక్‌ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తిరుమలకు వచ్చే భక్తులు వాహనాల్లో నిషేధిత వస్తువులను తరలించకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు తనిఖీ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు టీటీడీ పేర్కొంది. నిషేధిత వస్తువులు గుర్తించిన సందర్భంలో అలిపిరి టోల్‌గేట్ స్కానింగ్ కేంద్రం వద్దనే వాటిని సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు అలిపిరి వద్ద 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. పవిత్ర తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యత దృష్ట్యా డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి రికార్డింగ్ పరికరాలు పూర్తిగా నిషేధమని, వీటిని తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్లు తదితర అంశాల్లో దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని టీటీడీ సూచించింది. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని భక్తులకు సూచించింది. భక్తులను అప్రమత్తం చేసేందుకు సామాజిక మాధ్యమాలు, ఎస్‌వీబీసీ, ప్రజా సంబంధాల విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.













