రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ మొత్తంలో అక్రమ గంజాయి రవాణా బయటపడింది. ముంచింగిపుట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెదబయలు మండలం కుజుబంగి జంక్షన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు 1,373.72 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెల్లటి సంచుల్లో దాచిపెట్టిన గంజాయిని తరలిస్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా కొనసాగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్పీ అమిత్ బర్దార్ జిల్లా పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ సూచనల మేరకు అల్లూరి జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి, అనుమానం ఉన్న ప్రాంతాల్లో నిఘాను మరింతగా పెంచారు. గంజాయి సాగు, రవాణాపై పక్కడ్బంది ప్రణాళికతో చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ముంచింగిపుట్టు పోలీసులు కుజుబంగి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, అక్కడుగా వెళ్తున్న ఓ బొలేరో వాహనంపై అనుమానం రావడంతో ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనంలో తెల్లటి సంచులు కనిపించడంతో వాటిని తెరిచి చూడగా గంజాయి వాసన రావడంతో విషయం స్పష్టమైంది. మొత్తం 43 బస్తాల్లో భారీ మొత్తంలో గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
వాహనంలో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి 1,373.72 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. గంజాయి తరలిస్తున్న వారు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వారని, మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ నుండి పెదబయలు మండలం జామిగూడ, రూడకోట మార్గంగా వాహనం వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. జిల్లాలో గంజాయి సాగు ఎక్కడా లేదని, అయితే ఇతర ప్రాంతాల నుంచి అక్రమ రవాణా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యువత జీవితాలను మాదకద్రవ్యాలు నాశనం చేస్తాయని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అక్రమ రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు.













