రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శుక్రవారం కాజల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో పోస్టర్‌ను పంచుకుంటూ కాజల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నటన, వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాన్ని రాశారు.
నిర్మాణ సంస్థ విడుదల చేసిన పోస్టర్‌కు “ప్రతి తుపాను వెనక ఓ బలమైన కారణం ఉంటుంది” అనే క్యాప్షన్ జతచేసింది. దీంతో చిత్ర కథ, కాజల్ పాత్రపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
బాలకృష్ణ, కాజల్ జోడీగా ఇదే రెండోసారి స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి నటించిన ‘భగవంత్ కేసరి’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ విజయంతో ఈ కొత్త చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముంబయి నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘ఎన్‌బీకే111’ రూపుదిద్దుకుంటోంది. బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. 1993 ముంబయి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కథ నడుస్తుందనే సూచనలతో ఇటీవల ఓ కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేశారు.
ఆ వీడియోలో బాలకృష్ణ మాస్ అవతారం, స్టైలిష్ లుక్, ఆయన యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజయవంతమైన ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ నెలకొంది.
ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని తమన్ సమకూరుస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.







