రాయలసీమ న్యూస్, వెదర్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణం మేఘావృతంగా కొనసాగనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ తాజా వాతావరణ హెచ్చరికల్లో పేర్కొంది.
ముఖ్యంగా కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ సంబంధిత శాఖలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ జూలై 19న శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల మరియు కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఈ జిల్లాల్లో వాతావరణం ఆకస్మికంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, ముఖ్యంగా ఓపెన్ ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపకుండా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఉరుములు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా భారీ హోర్డింగుల వద్ద నిలబడకూడదని సంస్థ హెచ్చరించింది. ఇలాంటి ప్రదేశాల్లో నిలబడటం వల్ల పిడుగులు పడే ప్రమాదం, వస్తువులు కూలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
సముద్రం తీవ్ర అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున తీర ప్రాంత మత్స్యకారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని, సముద్ర పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు తీర ప్రాంతంలోనే ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలు, మత్స్యకారులు, తీర ప్రాంత నివాసితులు వాతావరణ హెచ్చరికలను గమనించి, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కోరారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అధికారులు తెలిపారు.







