రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప– రాయలసీమ క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్ని నింపేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్–2026) ఐదో సీజన్ సిద్ధమైంది. ఇప్పటి వరకు విశాఖపట్నంలోనే నిర్వహించిన ఈ టోర్నీ, ఈసారి కడపలోనూ క్రికెట్ హంగామా సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియాన్ని వేదికగా ఎంపిక చేశారు.
ఈ నెల 17 నుంచి 21 వరకు ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించేలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్ణయం తీసుకుంది. మొత్తం ఏడు జట్లు, 32 మ్యాచ్‌లతో సాగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో రెండో విడత మ్యాచ్‌లను కడపలో జరపనున్నారు. ఇక్కడ జరగనున్న తొమ్మిది లీగ్ మ్యాచ్‌లు జూన్ 17న ప్రారంభం కానున్నాయి.
ఆ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్ శైనేర్స్ , డిఫెండింగ్ ఛాంపియన్స్ తుంగభద్రా వారియర్స్ జట్లు తలపడనున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన రాయల్స్ అఫ్ రాయలసీమ జట్టుతో పాటు సింహాద్రి వైజాగ్ లయన్స్ , కాపిటల్ అమరావతి రాయల్స్, తుంగభద్రా వారియర్స్, విజయవాడ సన్ శైనేర్స్, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్ జట్లు ఈ సీజన్‌లో పోటీపడతాయి.
ఈ టోర్నీలో హనుమ విహారి , రికీ భూఈ, KS భారత్ వంటి అంతర్జాతీయ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనుభవం ఉన్న క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు పలువురు యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలనుకునే యువ క్రికెటర్లకు ఇది మంచి వేదికగా మారనుంది.
మ్యాచ్‌ల నిర్వహణకు అనుగుణంగా వైఎస్ రాజారెడ్డి స్టేడియంలోని పిచ్‌లు, అవుట్‌ఫీల్డ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడేలా ఏసీఏ అధికారులు సిద్ధం చేశారు. స్థానిక క్రీడాభిమానులు తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
క్రికెట్ క్రేజ్‌ను యువతకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు, స్థానిక అకాడమీల క్రికెటర్లు దేశీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల ఆటతీరును దగ్గరగా చూసే అవకాశం దక్కనుంది.
మ్యాచ్‌ల షెడ్యూల్, టికెట్ల వివరాలు, ప్రతి మ్యాచ్ విశేషాలపై త్వరలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఏసీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో కడప క్రికెట్ స్టేడియం క్రీడాభిమానులతో కిక్కిరిసి, పండగ వాతావరణాన్ని సంతరించుకునే అవకాశముంది.













