రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బి. మఠం మండలం రేకలకుంట పంచాయతీ పరిధిలోని వాంపల్లెచెరువు గ్రామంలో నిర్మించనున్న శ్రీ వెంగమాంబ నూతన ఆలయానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ నిధులతో సుమారు రూ.40 లక్షల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు.
గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించిన గౌరవ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే ఆలయ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆశీస్సులతో, బి. మఠం మండల టీడీపీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి సహకారంతో భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో పూజారులు వైదిక మంత్రోచ్చరణల మధ్య వేదపారాయణాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ కడప జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి, బి. మఠం మాజీ మండల అధ్యక్షులు మాలేపాటి సుబ్బారావు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక కార్యకలాపాలకు వేదికగా ఉపయోగపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ సేవలకు ఈ ఆలయ నిర్మాణం మరో నిదర్శనంగా నిలుస్తుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగాలని వారు ఆకాంక్షించారు.













