రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు, కల్తీ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలు నియోజకవర్గంలో విస్తృతంగా పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయని రాచమల్లు ఆరోపించారు. నియోజకవర్గంలో కొత్తగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని, గంజాయితో పాటు కల్తీ మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారుతున్నారని, తమ బంగారంలాంటి జీవితాలను స్వయంగా నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని రాచమల్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని తక్షణమే అరికట్టాలని ప్రభుత్వం, పోలీసు శాఖను ఆయన డిమాండ్ చేశారు.
గంజాయి విక్రయాలపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే వైసీపీ తరఫున నిరాహార దీక్షలు చేపడతామని రాచమల్లు హెచ్చరించారు. ఒకవైపు గంజాయి విక్రయాలను అరికట్టాలని తాము డిమాండ్ చేస్తుంటే, తమపైనే విచారణ జరపాలని కూటమి నాయకులు పోలీసు అధికారులను ఆశ్రయించడం విచిత్రమని ఆయన మండిపడ్డారు.
తనపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని, ప్రజలే ఈ ప్రభుత్వానికి గోరి కడతారని ఆయన వ్యాఖ్యానించారు.













