ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర చర్యలు ప్రారంభించినట్లు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. పట్టణ ప్రజల నుంచి వరుసగా వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని సమస్యను సమూలంగా అంచనా వేసి, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇటీవలి రోజులుగా నిర్వహిస్తున్న “ప్రజలతో కమిషనర్ ముఖాముఖి” కార్యక్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి వీధి కుక్కల సమస్యపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత, వ్యాప్తిని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసే పనులు మున్సిపాలిటీ స్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు.

వీధి కుక్కల సమస్య ఒక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధికే పరిమితం కాకుండా, చుట్టుపక్కల గ్రామాలు, సమీప మున్సిపాలిటీలకు కూడా సంబంధించిన అంశమని కమిషనర్ వివరించారు. అందువల్ల సమన్వయంతో, సమగ్రంగా సమస్యను ఎదుర్కొనే దిశగా సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ క్రమంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చుట్టూ ఉన్న ప్రధాన పంచాయతీలైన కొత్తపల్లె, దొరిసానిపల్లె, గోపవరం, సోములవారిపల్లె, చౌటపల్లె పంచాయతీ ప్రతినిధులతో పాటు, సమీప మున్సిపాలిటీలైన మైదుకూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, కమలాపురం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.

ఈ సమగ్ర సమావేశాన్ని సెప్టెంబర్ 7, 2026 సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో ప్రతి ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించి, సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు కమిషనర్ చెప్పారు.

ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 7 వేల వీధి కుక్కలు ఉన్నట్లు అందిన సమాచారం ఆధారంగా అంచనా వేస్తున్నామని, ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులందరితో కలిసి సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ వివరించారు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిగణిస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చట్టబద్ధమైన, మానవతా దృక్పథంతో కూడిన శాస్త్రీయ పరిష్కార మార్గాలను అమలు చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ స్పష్టం చేశారు.