రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు : సూపర్ సిక్స్ హామీల్లో ఇంకా అమలు కాని వాగ్దానాలపై కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ప్రొద్దుటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలు ప్రధాన కారణమని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాలు పూర్తయినా ఆ హామీల్లో ముఖ్యమైనవి అమలు కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి పార్టీలు సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలులోకి రాలేదని, ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

అలాగే ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నప్పటికీ, అది కూడా ఇప్పటివరకు అమలు కాలేదని తులసి రెడ్డి తెలిపారు. ఆడబిడ్డలను నమ్మించి మోసం చేయడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ల వయస్సు నుంచే సామాజిక పెన్షన్ అందిస్తామని కూటమి పార్టీలు వాగ్దానం చేశాయని ఆయన తెలిపారు. అయితే రెండేళ్లు గడిచినా ఆ హామీ కూడా అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. ఈ వర్గాలను నమ్మించి మోసగించడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
పై మూడు హామీలను ఇక ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మీడియా సమావేశంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎస్ఎండి పూల నజీర్, ప్రొద్దుటూరు పట్టణ మాజీ అధ్యక్షులు జిలాని భాష, ఖాజాపీర్, లాజం భాష, భాస్కర్, రామకృష్ణ, వేమయ్య, రాజేష్, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, చాగలేటి వెంకటేశు, ఐచర్ రమణ, చిన్నకోట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోవడం శోచనీయమని డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి పేర్కొన్నారు. క్వార్టర్‌కు 700 కోట్ల రూపాయల చొప్పున 9 క్వార్టర్లకు గాను 6,300 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు.
స్కాలర్షిప్ పథకం కింద 2,200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయని, మొత్తం కలిపి 8,500 కోట్ల రూపాయలు బకాయిలు నిల్వ ఉన్నాయని తులసి రెడ్డి తెలిపారు. దీనివల్ల కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు.













