రాయలసీమ న్యూస్, అగ్రికల్చర్ డెస్క్:
ఎరువుల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు విజిలెన్స్ నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కౌలు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లు, జేసీలు, వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలోని 28 జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతుల్లో అనవసర ఆందోళనలు రేకెత్తించకుండా పరిస్థితిని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ఎరువుల పంపిణీపై తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించబోమని, అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
పంటల వారీగా ఎరువుల వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. మండల స్థాయిలో ముందస్తుగా తగిన ఎరువుల నిల్వలు ఉంచాలని, గత ఏడాది ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హితవు పలికారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో ఎఫ్ఎఫ్ఎస్ ద్వారా ఎరువుల బుకింగ్ నిర్వహించాలని, మిగతా 26 జిల్లాల్లో ఏపీఎఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.
ఇక ఎరువుల దారి మళ్లింపుపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చర్యలు కొనసాగించాలని అధికారులకు సీఎం చంద్రబాబు కార్యదర్శి రాజమౌళి సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి రియల్‌టైమ్ గ్రీవెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని రైతు సేవా కేంద్రాలకు లాగిన్ వివరాలు అందించినట్లు వెల్లడించారు. ఖరీఫ్ ఈ-క్రాప్ బుకింగ్ రైతుల జాబితా డౌన్లోడ్ సౌకర్యం కల్పించినట్లు రాజమౌళి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎరువుల రిటైలర్లు ఏపీఎఐఎంఎస్ 2.0లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు గుర్తింపు పొందిన రిటైలర్ల ద్వారా ఎరువులు కొనుగోలు చేసే అవకాశం ఉండేలా వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. శాస్త్రవేత్తల సిఫార్సుల ఆధారంగానే ఎరువుల కేటాయింపు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం కార్యదర్శి రాజమౌళి సూచించారు.







