రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
హోం మంత్రి అనితపై వ్యక్తిత్వ హననానికి వైసీపీ నేతలు దిగజారారు: గొట్టిపాటి రవికుమార్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, మహిళల పట్ల జగన్కు, గొడ్డలి పార్టీగా అభివర్ణించిన వైసీపీ నేతలకు ఉన్న గౌరవం ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
హోం మంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేతల అసభ్య పదజాలం ప్రజలు భరించలేకపోయారని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అలాంటి బూతుల రాజకీయాలు తగ్గాయని, ప్రజలు ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో మళ్లీ తమ ఉనికి చాటుకునేందుకు వైసీపీ నేతలు అదే పాత పంథాను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు.
మహిళలను కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదని, ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళలపై ద్వేషంతోనే వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, మహిళల పట్ల చులకనగా మాట్లాడే నేతలకు ఈ సమాజంలో స్థానం ఉండకూడదని గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు.
ఇక వైసీపీ అధినేత జగన్పై రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ రాజకీయ ధోరణిలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ కాపు సమాజాన్ని బలిపశువులుగా మార్చాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజలు జగన్ కుట్రలను తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసినా, ఆయన మళ్లీ కులాల మధ్య విభేదాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.
జగన్ ప్రేరేపించిన కుల రాజకీయాల భాగంగానే గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి అనితపై దిగజారిన వ్యాఖ్యలు చేశారని సానా సతీశ్ అన్నారు. మహిళలంటే జగన్కు మొదటి నుంచీ ద్వేషమనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, కన్న తల్లి, సొంత చెల్లిని దూరం పెట్టిన విధానమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. కష్టపడి స్వశక్తితో ఉన్నత స్థానానికి చేరుకున్న అనితపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
మహిళల పట్ల వైసీపీ నేతల చిన్నచూపుకు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలే నిదర్శనమని సానా సతీశ్ అన్నారు. అహంకారంతో మహిళలను అవమానించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. మహిళల పట్ల వైసీపీ వైఖరి ఇలాగే కొనసాగితే 2029లో ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ రాకపోవచ్చని వ్యాఖ్యానించారు. మహిళల పట్ల చులకనగా మాట్లాడే నేతలకు ఈ సమాజంలో స్థానం లేదని సానా సతీశ్ తెలిపారు.







