రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాద్ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీజీ20 లీగ్‌లో అత్యంత ఖరీదైన జట్టు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నేడు మైదానంలోకి దిగుతోంది. టోర్నీలో మూడో రోజు భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ జట్టు పాలమూరు స్ట్రైకర్స్‌తో తలపడనుంది.
పాలమూరు స్ట్రైకర్స్ ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడి ఖమ్మం ఏసెస్ చేతిలో ఓటమి పాలైంది. తొలి పరాజయం తర్వాత పుంజుకోవాలని ఆ జట్టు చూస్తుండగా, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మాత్రం విజయంతో టోర్నీ ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వేలంలో వ్యూహాత్మకంగా రెండంకెల సంఖ్యలో ఆల్‌రౌండర్లను ఎంచుకుని హైదరాబాద్ జట్టును బలంగా తీర్చిదిద్దారు. ఈ జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు ఆల్‌రౌండర్లే ఉండడం విశేషం. రంజీ అనుభవం ఉన్న అభిరథ్ రెడ్డి సారథ్యంలో ఈ ఛాంపియన్స్ బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీలో ఛత్తీస్‌గఢ్‌పై 121 పరుగులతో శతకం సాధించిన అభిరథ్‌ను వేలంలో 11 లక్షలకు దక్కించుకున్నారు. అతడిపై బ్యాటర్‌గా, సారథిగా మంచి అంచనాలు ఉన్నాయి.
అదే ధరకు జట్టులో చేరిన అజయ్‌దేవ్ గౌడ్ కూడా విలువైన ఆల్‌రౌండర్‌గా నిలవనున్నాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. భారత అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం అజయ్‌కు ఉంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రణవ్ వర్మ గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు.
ఓపెనర్ సాయివికాస్ రెడ్డిపై జట్టులో భారీ అంచనాలు ఉన్నాయి. దూకుడుగా ఆడే ఈ బ్యాటర్‌కి ఉప్పల్ స్టేడియంలోని బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ తోడైతే పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు తిప్పగలడని భావిస్తున్నారు. గడుగు గణేశ్ హిట్టర్‌గా, బంతితోనూ రాణించగల ఆల్‌రౌండర్‌గా జట్టుకు బలం చేకూర్చనున్నాడు.
వేలంలో ఈ ఛాంపియన్స్‌కు ఎంపికైన తర్వాత భారత అండర్–19 జట్టులో చోటు దక్కించుకున్న యశ్వీర్ గౌడ్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. ఈ యువ ఆల్‌రౌండర్‌కు ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం లభించే అవకాశం ఉందని జట్టు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పేసర్ అఖిల్ రాథోడ్ వేగంగా బంతులు వేయగలడు. అతడికి బ్యాటింగ్‌లోనూ చెలరేగే సామర్థ్యం ఉంది. తరుణ్ రాజన్, షణ్ముఖ మురుగన్, శ్రీనికేత్, ప్రేమ్ చరణ్, గుడెల్లి జశ్వంత్, ప్రత్యూష్ కుమార్, ఎమ్‌ఎమ్ చరణ్ వంటి ఆల్‌రౌండర్లతో హైదరాబాద్ జట్టు సమతూకంగా, శక్తిమంతంగా కనిపిస్తోంది.
పి. అరవింద్ రూపంలో హిట్టింగ్ చేయగల వికెట్ కీపర్ బ్యాటర్ జట్టుకు లభ్యమయ్యాడు. అన్విత్ రెడ్డి, వైష్ణవ్ రెడ్డి కూడా తమ ప్రతిభతో ఆకట్టుకునే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు.
లీగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుండటంతో నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఛాంపియన్స్ జట్టుకు స్థానిక క్రికెట్ అభిమానుల నుంచి గట్టి మద్దతు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. తమపై ఉన్న అంచనాలను ఎంత మేర నెరవేర్చగలదన్నది హైదరాబాద్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.
మరోవైపు తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన పాలమూరు స్ట్రైకర్స్ ఈసారి తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. రెండు జట్లూ కీలక సమరానికి సన్నద్ధమవుతుండటంతో ఉప్పల్ స్టేడియంలో ఆసక్తికర పోరు నెలకొననుంది.







