తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ గత నాలుగేళ్లుగా దశలవారీగా కొనసాగినట్టు సంబంధిత పత్రాలు సూచిస్తున్నాయి.

తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులకు తగిన నైపుణ్య శిక్షణ అవకాశాలు లేకపోవడంతో, తిరుపతిలో NIELIT కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 02-03-2022న లేఖ రాసినట్టు సమాచారం. ఈ లేఖలో తిరుపతి ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

తదుపరి, అదే సంవత్సరం 23-12-2022న NIELIT డైరెక్టర్ జనరల్ కు పంపిన మరో లేఖలో, తిరుపతిలో NIELIT కేంద్రం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని పంపినందుకు తిరుపతి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ప్రాజెక్టును త్వరగా అమలు చేయాలని కోరారు.

01-04-2023న తిరుపతిలో NIELIT సంస్థ ప్రారంభమవుతున్న సందర్భంగా సంబంధిత గౌరవ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడే శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేసినట్టు పత్రాల్లో ఉంది. అనంతరం 17-05-2023న ఈ అంశంపై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తామని కేంద్రం నుంచి సమాధానం అందినట్టు పేర్కొనబడింది.

తిరుపతిలో NIELIT శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ 15-05-2026న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందు కూడా పలుమార్లు ఈ అంశంపై మంత్రి‌ను కలిసిన నేపథ్యంలో, 22-06-2026న ఆయన ఇచ్చిన సమాధానంలో NIELIT శాశ్వత క్యాంపస్‌ కోసం అవసరమైన భూ కేటాయింపు వివరాలు, DPRను పంపాలని కేంద్రం కోరింది.

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) పరిధిలోని NIELIT నిపుణులు సిద్ధం చేసిన DPRలో “ సెట్టింగ్ అప్ అఫ్ పెర్మనెంట్ క్యాంపస్ of NIELIT at తిరుపతి , విచ్ ఐస్ డీమ్డ్ టూబీూనివెర్సిటీ ” అని స్పష్టంగా నమోదు చేశారు. అలాగే తిరుపతిలో సుమారు 15 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక చేసినట్టు కూడా DPRలో పేర్కొనబడింది. ఇందుకు సంబంధించిన భూస్కెచ్‌ను కూడా DPRకు జతచేశారు.

ఈ నేపథ్యంలో, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలకు వెళ్లి నైపుణ్య శిక్షణ పొందేందుకు ఆర్థికంగా సామర్థ్యం లేని నిరుపేద విద్యార్థులు, తిరుపతిలో భూ కేటాయింపులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్న సమయంలో ఇప్పుడు NIELIT కేంద్రాన్ని తిరుపతి నుంచి అమరావతికి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై రాయలసీమ ప్రాంత విద్యార్థులు, యువతలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తిరుపతిలో NIELIT శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే DPR, భూ కేటాయింపు ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో, ప్రాజెక్టు భవిష్యత్తు, కేంద్రం–రాష్ట్రం మధ్య జరుగుతున్న చర్చలపై రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ విద్యార్థులకు, యువతకు స్పష్టత ఇవ్వాలని స్థానిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.