శ్రీశైలం: పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా దేవస్థానం కల్పించింది. గురువారం మొత్తం 45 మంది భక్తులు పరోక్షసేవగా ఈ కుంకుమార్చనను జరిపించుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాము, ఒడిస్సా, హర్యానా, చత్తీష్‌ఘడ్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. అలాగే జర్మని నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు కూడా ఈ పూజలను పరోక్షంగా నిర్వహించుకుంటున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు.

లక్షకుంకుమార్చన కార్యక్రమంలో ముందుగా పూజాసంకల్పం పఠించడం జరుగుతుంది. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ భ్రమరాంబ అమ్మవారికి లక్షకుంకుమార్చనను ఆచారానుసారం జరిపిస్తారు.

మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు విశేష ప్రాధాన్యం ఉందని, ఈ కుంకుమద్రవ్యంతో అమ్మవారిని అర్చించడం అత్యంత ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు. లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతానసౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని శాస్త్రోక్తంగా చెప్పబడుతోంది.

శ్రీశైలం క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు తమ గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జిత పరోక్షసేవలను నిర్వహిస్తోంది. ఈ పరోక్షసేవకు భక్తులు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు సంప్రదించడం ద్వారా లేదా APTS వారి వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా సేవారుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చు.

లక్షకుంకుమార్చన పరోక్షసేవకు రూ.1,116 సేవారుసుముగా నిర్ణయించినట్లు దేవస్థానం వెల్లడించింది. ఇతర వివరాల కోసం దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351, 83339 01352, 83339 01353లను భక్తులు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.