రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీలో పరిశ్రమ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రెవెన్యూ, ఎక్సైజ్, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, లేబర్ తదితర శాఖల అధికారులతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్ పరిశ్రమను సందర్శించారు. పరిశ్రమలోని వివిధ విభాగాలను వరుసగా పరిశీలిస్తూ అక్కడి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, పరిశ్రమలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, పరిశ్రమ పరిసరాల్లో ఉన్న గ్రీనరీ, పరిశ్రమ నుంచి వెలువడే బై-ప్రొడక్ట్స్ నిర్వహణ, బై-ప్రొడక్ట్స్ ప్రాసెసింగ్ యూనిట్ పనితీరును కలెక్టర్ సమీక్షించారు. ఉత్పత్తి దశలన్నింటిలోనూ భద్రతా చర్యలు అమలులో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.

పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆదేశించారు.
పరిశ్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా కాలుష్య నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని, కాలుష్య స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరిశ్రమ నుంచి వెలువడే బై-ప్రొడక్ట్స్‌ను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహిస్తూ, వాటి ప్రాసెసింగ్ మరియు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. బై-ప్రొడక్ట్స్ నిల్వ, రవాణా, వినియోగ దశల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆమె స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
పరిశ్రమ పరిసరాల్లో గ్రీనరీని మరింత పెంచాలని, పరిశుభ్రతను నిరంతరం నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరిశ్రమ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమన్వయంగా సాగాలని, ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచించినట్లు సమాచారం.













