నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఇన్‌గేట్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులపై కత్తులు, రాళ్లతో దాడి చేసిన ఘటనలో నిందితులపై చర్యలు చేపట్టినట్లు నంద్యాల 1వ పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి కేసు పురోగతిపై వివరాలు వెల్లడించారు.

సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 24న రాత్రి 10.55 గంటల సమయంలో బైటిపేటకు చెందిన గుర్రం పశుపతి (32 సంవత్సరాలు), అతని తమ్ముడు మనోహర్‌పై మొత్తం తొమ్మిది మంది కలిసి దాడి చేశారు. కత్తులతో బెదిరించడంతో పాటు రాళ్లతో దాడి చేయడంతో ఇద్దరూ గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు Cr.No.88/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. BNS 191(1), 191(2), 118(1), 109(1) r/w 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంఘటనకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించినట్లు ఆయన వివరించారు.

దర్యాప్తు లో భాగంగా బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో బైటిపేటలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో నలుగురు జువైనల్స్‌ను పోలీసు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులను విచారించి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా దాడులకు పాల్పడితే, కఠిన చర్యలు తప్పవని సీఐ సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.