శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో, స్వామివారి స్పర్శ దర్శనాల వ్యవస్థలో దేవస్థానం అధికారులు కీలక మార్పులు చేపట్టారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే కాకుండా, విఐపి, వివిఐపి ప్రోటోకాల్ దర్శనాలపై కూడా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

తిరుమల తిరుపతి నమూనాలోనే శ్రీశైలం దేవస్థానంలో విఐపి, వివిఐపిల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసి, ఆన్‌లైన్ ఓటిపి సిస్టమ్‌ను ప్రవేశపెట్టినట్లు ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. స్వామివారి దర్శనాల సమయాల్లో మార్పులు చేస్తూ, సాధారణ భక్తులకు విడతలవారీగా, విఐపిలకు వేరే సమయాల్లో దర్శనాలు కేటాయించడం ద్వారా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ఆన్‌లైన్ విధానంలో ఓటిపి ద్వారా నేరుగా భక్తుల సెల్‌ఫోన్‌లలోనే టికెట్లు అందుబాటులోకి వచ్చేలా నూతన వ్యవస్థను అమలు చేశారు. దీంతో విఐపి, వివిఐపిలు టికెట్ల కోసం కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, వారి సెల్‌ఫోన్‌లలోనే టికెట్లు ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు చేశారు.

ఆలయ క్యూలైన్లలో భక్తులు గంటలకొద్దీ వేచి ఉండకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేర్వేరు సమయాల్లో విడతలవారీగా స్వామివారి స్పర్శ దర్శనాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దర్శనాల క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా, భక్తులు ప్రశాంతంగా క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని వారు పేర్కొన్నారు.

విఐపి, వివిఐపి లేఖలను కనీసం 48 గంటల ముందుగా శ్రీశైలం దేవస్థానం ప్రోటోకాల్ విభాగానికి పంపితే, దేవస్థానం సిబ్బంది నేరుగా విఐపిల WhatsApp నంబర్లకు టికెట్లతో కూడిన లింకును పంపుతారు. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఓటిపి ద్వారా ఫోన్‌లో గాని, Google Pay ద్వారా గాని టికెట్ల నగదు చెల్లింపు పూర్తి చేసిన తర్వాత, టికెట్లు నేరుగా WhatsApp‌లో ప్రత్యక్షమవుతాయి. అనంతరం భక్తులు శ్రీశైలం ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, స్లాట్ విధానంలో సులభంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు.

సామాన్య భక్తుల దర్శనాల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా, విఐపి, వివిఐపిలకు ప్రత్యేక టైమ్ స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. ఇకపై శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆన్‌లైన్‌లోనే టికెట్లు అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంటూ, భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని అధికారులు కోరారు.